ఎస్వీయూ చుట్టూ వరుస కోర్టు కేసులు
సర్కారు అభిమతానికి ఆటంకాలు
నోటిఫికేషన్లు వచ్చే వరకూ అనిశ్చితే
అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపక పోస్టుల భర్తీ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్ మారింది. నియామకాలు ఎప్పటికి జరుగుతాయి? అసలు జరుగుతాయా? అన్న అనుమానాలు ఈ కొలువులపై ఆశలు పెట్టుకు న్న వారిని వెంటాడుతున్నాయి. గతంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, బాధ్యతా రాహిత్యం కారణంగానే ప్రతిష్ఠంభన కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,385 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. రెండేళ్లుగా అడుగుడుగునా ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి.
గతంలో మాదిరిగా రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు జరగకుండా చెక్ పెట్టేందుకు తొలుత స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించాలని, ఈ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించాలని సర్కారు ఆలోచన. దీన్ని పలుమార్లు వైస్‌చాన్సెలర్ల సమావేశంలో పెట్టి వారి ఆమోదం తీసుకున్నారు. కానీ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన విశ్వవిద్యాలయాలు చివరికి ఏం చేస్తాయోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయని, అవి అకడమిక్ బాడీలన్న వాదనల నడుమ అసలు ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకవైపు వరుస కోర్టు కేసులు.. మరో వైపు వర్సిటీల పాత్ర మధ్య స్ర్కీనింగ్ టెస్ట్ అన్ని వర్సిటీలు నిర్వహిస్తాయా? లేక తమకు అవసరం లేదన్న నిర్ణయానికి వస్తాయా? అన్న విషయమై స్పష్టత లేకుండా పోయింది. రిక్రూట్‌మెంట్‌పై పడుతున్న కోర్టు కేసులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కేంద్రంగానే నడుస్తున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి.
పోస్టుల రేషనలైజేషన్‌కు సంబంధించి హైపవర్ కమిటీ చేసిన సిఫారుసులను.. అంటే పోస్టుల రీడిజిగ్నేషన్ చేయడం, అవసరం ఉన్న డిపార్ట్‌మెంట్లకు పోస్టులు బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో సదరు ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. అయితే పాలక మండళ్ల అనుమతితో చేసుకోవచ్చని కోర్టు చెప్పడం తెలిసిందే. తాజాగా సీఏఎస్ - ప్రమోషన్లపైనా కొందరు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్సిటీల పాలక మండళ్లు మరోసారి సమావేశం కాబోతున్నాయి. ఈ సందర్భంగా చేసే తీర్మానాలు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కీలకం కానున్నాయని సమాచారం. ప్రభుత్వం తరఫున నియమించిన స్టాండింగ్ కౌన్సిళ్లు కూడా ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకునేందుకు కొంత మంది తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రిక్రూట్ మెంట్ జరగకుండా అడ్డుకునేందుకు ఓ వర్గం అన్ని విధాల తెర వెనుక ప్రయత్నాలు చేస్తోందన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తమ అనుచరులకు అధ్యాపక పోస్టులు రావాలంటే ఈ ప్రభుత్వంలో రిక్రూట్‌మెంట్ జరగరాదని వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ చివరికి ఏ మలుపు తిరగనుందో అనే దానిపై వర్సిటీలు నోటిఫికేషన్లు జారీ చేసే వరకూ స్పష్టత రాబోదని సమాచారం.

No comments:
Post a Comment